
రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసిఆర్ ఆలోచన అని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కష్టకాలంలో కూడా రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతురుణ మాఫీ ఇవ్వడం ఆయన ఘనత అని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామంలో నియంత్రిత సాగు పై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ కార్యక్రమంలో మాట్లాడుతూ…ఈ క్లస్టర్ లో సుమారు 1100 మంది రైతులకు కోటి రూపాయల మేరకు 25వేల రూపాయల లోపు రైతు రుణాలు మాఫీ అయ్యాయని చెప్పారు. కొత్త రైతులకు కూడా రైతుబంధు రానుందని, మిగిలిన వారికి కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
డోర్నకల్ లోని ప్రతి ఆయకట్టుకు గ్యాప్ లేకుండా గోదావరి జలాలను తీసుకురావడానికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని సిఎం కేసిఆర్ గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు మంత్రి. మహబూబాబాద్ లోనే ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి సమావేశం పెట్టి ప్రతి చెరువును నింపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు పంటలు పండించుకునేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీవాళ్లు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్నారని, సీఎం కేసీఆర్ మాత్రం లక్ష రూపాయలనే మాఫీ చేస్తానని, విడతల వారిగా చేస్తానని చెప్పారన్నారు. ప్రజలు కేసిఆర్ గారిని నమ్మి ఓటు వేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా 25వేల లోపు రుణమాఫీ కోసం 1200 కోట్ల రూపాయలను ఈ కష్టకాలంలో కూడా ఇచ్చారని మంత్రి చెప్పారు. గత రెండేళ్లుగా 12వేల కోట్ల రూపాయలు చొప్పున రైతుబంధు కోసం ఇవ్వగా ఈసారి అదనంగా పెరిగిన రైతులకు లబ్ది చేసేందుకు మరో 2000 కోట్ల రూపాయలు పెంచి 14000 కోట్ల రూపాయలు రైతు బంధుకు ఇచ్చారన్నారు.
ఈ ప్రాంతంలో రైతులకు పాస్ పుస్తకాలు కాలేదని, సిఎం కేసిఆర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని ఆమె చెప్పారు. భూమి కలిగిన రైతు ఎవ్వరూ నష్టపోకుండా వాళ్ల భూములను వారి పేరు మీద చేసేందుకు పాస్ పుస్తకాలు చేయాలని కలెక్టర్ ని కోరారు.