ప్రీతి కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

ప్రీతి కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

ప్రీతి మృతిని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా నిరోధించాలో ఆలోచన చేయాలి తప్ప.. రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. ప్రీతి మృతి కేసులో దర్యాప్తు జరుగుతోందని..దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.  జనగామ జిల్లా కొడకండ్ల మండలం  గిర్ని తండా గ్రామంలో డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,  సత్యవతి రాథోడ్ పరామర్శించారు. 

అండగా ఉంటాం...

ప్రీతి మృతి అత్యంత దురదృష్టకరం, బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  ప్రీతి ఘటన పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన విచారం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

దోషులకు కఠిన శిక్ష

ప్రీతి పై విషప్రయోగం చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.  మంత్రి హరీశ్ రావు ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశారని.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రీతి చాలా ధైర్యవంతురాలు, కష్టపడి చదివి డాక్టర్ అయి ప్రజలకు  సేవలు అందించాలని అనుకుంది కానీ ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.