
మంత్రి సీతక్క 2021 లో నమోదైన కేసులో గురువారం (జులై 24) నాంపల్లి ప్రజాప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు. 2021 లో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ధర్నా చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసులో మంత్రి సీతక్క కోర్టుకు హాజరయ్యారు.
కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి2021 లో నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌కు చికిత్స అందజేయాలని, ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు ఆసుపత్రిల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ (CMRF) కింద చెల్లించాలని కోరారు. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసి కరోనా వ్యాప్తి చేస్తున్నారని అప్పటి ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది.
ఈ కేసులో నాంపల్లి మనోరంజ్ కోర్టుకు హాజరైన సీతక్క.. మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ , ఎన్.ఎస్.యూ.ఐ నాయకులతో కలిసి ధర్నా చేసినట్లు చెప్పారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడితే అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాము నిరసనకు దిగితే , కరోనా వ్యాప్తి చేస్తున్నామని కేసులు పెట్టారని మండిపడ్డారు. న్యాయస్థానాన్ని తాము గౌరవిస్తున్నామని చెప్పిన మంత్రి సీతక్క.. తదుపరి విచారణను కు కూడా హాజరు అవుతానని చెప్పారు.