పదేండ్లలో పది ప్రభుత్వాలు కూల్చిన బీజేపీ: మంత్రి సీతక్క

పదేండ్లలో పది ప్రభుత్వాలు కూల్చిన బీజేపీ: మంత్రి సీతక్క

కాగజ్ నగర్, వెలుగు: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ ను, గాంధీ, నెహ్రూ ఫ్యామిలీలను తిట్టడం, బురద జల్లడమే ప్రధాని నరేంద్ర మోదీ దినచర్యగా మారిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేండ్లలో కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత పది కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన ఘనత బీజేపీకి దక్కిందని ఆమె విమర్శించారు. ఇప్పుడు దేశానికి కాంగ్రెస్ గెలుపు ఎంతో ముఖ్యమని, ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆదివారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలోని ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో  మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి తన అనుచరులతో సహా కాంగ్రెస్ లో చేరారు. మోదీ పదేండ్లలో కులాల కొట్లాటలు తెచ్చాడని, ఉద్యోగాలు, అభివృద్ది అడిగితే రాముని అక్షింతలు పంపించాడని విమర్శించారు. 

దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, దీన్ని ప్రజలంతా గమనించి తగిన బుద్ది చెప్పాలన్నారు. రూ.500 ఉన్న గ్యాస్ సిలిండర్ ను రూ.1200 చేసిన ఘనత మోదీ సర్కార్ కే దక్కిందని, ఆదానీ, అంబానీ.. రిలయన్స్, జియో ల కోసమే బీజేపీ పని చేస్తోందన్నారు. నల్లధనం తీసుకువస్తానని, ప్రతి ఎకౌంటులో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ మాట కూడా ఎత్తడం లేదన్నారు. బీఆర్ఎస్ గల్లీలో కూడా కనిపించదని, దానికి ఓటు వేయడం దండుగ అని అన్నారు. తమకు లొంగలేదని శిబూసోరెన్ వంటి గిరిజన లీడర్​ను  జైలుకు పంపిన చరిత్ర బీజేపీదన్నారు. ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నామని, 92 శాతం మందికి రైతు బంధు ఇచ్చామన్నారు. మొన్నటి దాకా నోరు తెరిస్తే బహుజన వాదం అంటూ, దళితుల పక్షపాతిగా గొప్పలు చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్​పంచన చేరి బీఆర్ఎస్​పాలన స్వర్ణయుగం అంటూ కితాబునివ్వడం హాస్యాస్పదమన్నారు.   

ప్లాన్​తోనే బీఆర్​ఎస్​లోకి ప్రవీణ్​: కోనేరు కోనప్ప

బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో అడుగు పెట్టిన వెంటనే ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయని, కేసీఆర్​ కూతురు కవిత అరెస్టయ్యారని, కేసీఆర్ ​జాగ్రత్తగా ఉండాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హితవు పలికారు. ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు బీఆర్ఎస్ లో చేరాడో తెలుసునన్నారు. కేసీఆర్​ వయసు పై బడిందని, ఆయన పార్టీ దగ్గర రూ.1200 కోట్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఒక్కో ఆరోపణతో కేసీఆర్ అండ్​ ఫ్యామిలీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలో రూ.1200 కోట్లను దక్కించుకునేందుకే  ​ప్రవీణ్​కుమార్ ​ప్లాన్​చేశాడన్నారు. ప్రవీణ్ దగ్గరుండి అందరినీ  జైలుకు పంపుతాడని, తర్వాత అన్ని గుంజుకొని పోతాడని జోస్యం చెప్పారు. త్వరలోనే ఎంపీ సంతోష్​ కూడా జైలుకు వెళ్తారన్నారు. జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దుర్గం భాస్కర్, అసెంబ్లీ ఇన్​చార్జి  రావి శ్రీనివాస్, శ్యామ్ నాయక్  పాల్గొన్నారు.