మిడతల దండును పంపిస్తే భయపడం.. మా జోలికొస్తే నాశనమైపోతవ్.. కేటీఆర్పై మంత్రి సీతక్క ఫైర్

మిడతల దండును పంపిస్తే భయపడం.. మా జోలికొస్తే నాశనమైపోతవ్.. కేటీఆర్పై మంత్రి సీతక్క ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు.  ఒక ఆదివాసి బిడ్డ అని కూడా చూడకుండా తనను టార్గెట్ చేస్తున్నారని మండి పడ్డారు. ములుగు లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి సీతక్క. ‘‘ఆదివాసి బిడ్డనైన నన్ను టార్గెట్ చేసి మిడతల దండును ములుగుకు పంపిస్తున్నావా కేటీఆర్.. సమ్మక్క సారక్క వారసులం.. మా జోలికివస్తే నాశనమై పోతావు..’’ అని విరుచుకుపడ్డారు.

తామేమైన తప్పులు చేస్తే అసెంబ్లీలో నిలదీయాలని.. కానీ పక్క నియోజకవర్గ నాయకులను తీసుకొచ్చి రోడ్ల మీద పొర్లాడితే సానుభూతి వస్తుందనుకోవడం మూర్ఖత్వమని విమర్శించారు. ‘‘అధికారంలో ఉండి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన మీరు ములుగులో సీతక్క రాజ్యం.. పోలీస్ రాజ్యం అంటూ ధర్నాలు చేస్తారా..’’ అంటూ కేటీఆర్ పై మండిపడ్డారు మంత్రి సీతక్క.

‘‘నీ సొంత చెల్లే నీ అహంకారాన్ని చూసి నీపై మట్టి పోస్తోంది.. నీవు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే చెప్పు... మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం..! ఎవరిని జైలుకు పంపించాం..!  ఆదివాసి మహిళ అయిన నన్ను టార్గెట్ చేసి నువ్వు సాధించేది ఏమిటి.. మీ ఇంట్లో ఉన్న ఆడిబిడ్డనే నువ్వు ఓర్తలేవని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఆడబిడ్డలంటే గిట్టదు నీకు.. కేటీఆర్ నీకు ఎందుకు ఇంత అహంకారం..’’ అని ప్రశ్నించారు. 

ములుగు నియోజకవర్గంలోకి ఇతర నియోజకవర్గ నాయకులను తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేయాలని కేటీఆర్ చూస్తున్నారని అన్నారు మంత్రి సీతక్క. తాము ఎంతమంది పై తప్పుడు కేసులు పెట్టామో లెక్కఉంటే తీయాలని.. నిలదీయాలని.. తాను ఎప్పటికైనా చర్చకు రెడీ అంటూ సవాల్ విసిరారు. దుబాయ్ లో స్టూడియోలు ఏర్పాటుచేసి తమపై రోత వార్తలు రాయించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.