ములుగు, వెలుగు: వెనుకబడిన, అటవీ ప్రాంత జిల్లాగా పేరుగాంచిన ములుగు విద్యారంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని, విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి జగ్గన్నపేటలో తన సోదరుడు ధనసరి సాంబయ్య వర్ధంతిలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో వరంగల్ రోటరీ క్లబ్ ఆఫ్ సహకారంతో జిల్లావ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50మంది విద్యార్థులకు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు.
ములుగు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి బూత్‌లెవెల్ ఏజెంట్ల సమావేశంలో మంత్రి పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నిర్వహణలో ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని సూచించారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
