
- ప్రజా సంక్షేమం మర్చిపోవట్లేదు: మంత్రి సీతక్క
- పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి, జగిత్యాల, వెలుగు: సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని మంత్రి సీతక్క అన్నారు. ప్రజా సంక్షేమం మరిచిపోవడం లేదని, అదే టైమ్‌లో అభివృద్ధిని విస్మరించడం లేదని తెలిపారు. ఇదే పంథా కొనసాగిస్తూ పాలన జరుగుతున్నదని అన్నారు. వెనుకబడిన నియోజకవర్గాలకు అత్యధికంగా ఫండ్స్ ఇవ్వాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ నుంచి నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం తెనుగువాడ ధర్మారం నుంచి ఎండపల్లి క్రాస్ రోడ్డు వరకు రూ.3.20 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణతో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు.
అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోనూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి పర్యటించారు. పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లిలో రూ.20 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. అనంతరం పెగడపల్లి మండలం నర్సింగ్ పేటగ్రామంలోని ఎస్సీ కాలనీలో సన్న బియ్యం లబ్ధిదారుడు తాండ్ర మహేశ్ సహస్ర ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు.
సీతక్క పనితీరు ఎంతో బాగున్నది: ఎంపీ వంశీకృష్ణ
మంత్రి సీతక్కతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తనను ఒక తమ్ముడిలా భావించి సలహాలు, సూచనలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలన్నారు. పెద్ద పల్లి పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ను అభివృద్ధి చేస్తామని, ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వంశీ కృష్ణ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రూ.20 కోట్లతో రోడ్లు, జీపీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేయడం హర్షనీయమన్నారు.
ధర్మపురికి నవోదయ స్కూల్ వస్తే ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారని, విప్ లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం దృషికి తీసుకువెళ్లినట్లు ఆయన గుర్తుచేశారు. ఎల్లంపల్లి ముంపు బాధితులకు రూ.18 కోట్ల పరిహారం తీసుకురావడం గొప్ప విషయమని వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలిచినా, ఓడినా తాను ప్రజల మధ్యే ఉన్నానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణా రావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొన్నారు.