జీ రామ్‌‌‌‌ జీ చట్టం పేదలకు వ్యతిరేకం.. రాష్ట్రంపై ఏడాదికి రూ.1,800 కోట్ల భారం: మంత్రి సీతక్క

జీ రామ్‌‌‌‌ జీ చట్టం పేదలకు వ్యతిరేకం.. రాష్ట్రంపై ఏడాదికి రూ.1,800 కోట్ల భారం: మంత్రి సీతక్క
  • పేదల పొట్టకొట్టేందుకే  కొత్త రూల్స్ 
  • సభ్యులంతా వ్యతిరేకించాలి.. గాంధీని బీజేపీ నేతలు అవమానిస్తున్నరని ఫైర్​
  • రాష్ట్రంపై ఏడాదికి రూ.1,800 కోట్ల భారం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌‌ జీ చట్టం పేదలకు వ్యతిరేకమని, దీన్ని సభ్యులంతా వ్యతిరేకించాలని  మంత్రి సీతక్క కోరారు.  స్కీమ్‌‌నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదని, తిరిగి చేర్చాలని డిమాండ్​ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మహ్మాతా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై స్వల్ప కాలిక చర్చను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ స్వల్పకాలిక చర్చ చేపట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

రాష్ట్రాలపై 40 శాతం నిధుల భారం వేయకుండా.. గతంలో మాదిరిగా 100 శాతం నిధులను కేంద్రమే భరించాలని డిమాండ్​ చేశారు. కొత్త చట్టంలో ఉన్న పంట సీజన్‌‌లో 60 రోజుల ఉపాధి హలీడే విధానాన్ని విరమించుకోవాలని కోరారు.  పీఎం గతిశక్తి కార్యక్రమానికి ఉపాధి హామీని ముడి పెట్టకుండా.. గతంలో మాదిరిగా గ్రామసభల్లో గుర్తించిన అవసరమైన పనులను కొనసాగించాలని పేర్కొన్నారు. వీబీ జీ రామ్‌‌ జీ చట్టాన్ని అమలు చేస్తే రాష్ట్రంపై అదనంగా ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల భారం పడుతుందని చెప్పారు.

యూపీఏ హయాంలో ఉపాధి హామీకి బడ్జెట్‌‌లో 4 శాతం నిధులు వెచ్చించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కేవలం 1.37 శాతం నిధులు మాత్రమే కేటాయించారని చెప్పారు. కోట్ల మంది కూలీల ఆకలి తీర్చిన  ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. 

నిరుడు కేటాయించిన 12. 5 కోట్ల పనిదినాలకు లెక్క వేస్తే ఉపాధి చట్టం కింద రాష్ట్ర వాటా రూ. 532.13 కోట్లు కాగా.. వీబీ జీ రామ్ జీ కింద రూ.2,320.10 కోట్లు ఉంటుందని,  అంటే.. రూ.1787.97 కోట్ల అదనపు ఆర్థిక భారం అవుతుందని చెప్పారు. 

ఆనాడు గాంధీని చంపింది ఆర్‌‌‌‌ఎస్ఎస్​ శక్తులేనని, నేడు ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరు తొలగించింది కూడా వారేనని అన్నారు. గాంధీని బీజేపీ నేతలు నిండు సభలో అవమానించడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల పొట్టకొట్టేందుకే కొత్త నిబంధనలు పెట్టిందని చెప్పారు.