సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ రావు నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. గోదావరి తీర ప్రాంతంలో ‘ఆస్కార్ గ్యాంగ్’గా పాపులరైన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ను చూపిస్తూ సాగిన టీజర్ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా షూటింగ్ కోసం ఫస్ట్ టైం గోదావరి జిల్లాలకు వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అర్థమైంది గోదావరి అంటే జస్ట్ ఒక ప్రాంతం కాదు.. అది ఒక కల్చర్, ఎమోషన్. కేరళ కంటే చాలా అద్భుతమైన లొకేషన్స్ గోదావరి ప్రాంతంలో ఉన్నాయి. ఒక కిటికీ నుంచి పల్లెటూరిని చూసినట్టుగా ఉంటుంది ఈ సినిమా.
నేను తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాను. నాకు గోదావరి యాస పలకడం నిజంగా ఒక సవాల్. కానీ డైరెక్టర్ నన్ను చాలా బాగా ట్రైన్ చేశారు. థియేటర్లో కూర్చున్న ఆడియెన్స్‌కు గోల్డెన్ అవర్‌లో గోదావరి పడవ ఎక్కినట్టుగా ఉంటుంది’ అని చెప్పాడు.
మాయ పాత్రతో అందర్నీ అలరిస్తానని హీరోయిన్ నిధి ప్రదీప్ చెప్పింది. డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ ‘ఇది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ. ఒక చల్లటి సాయంత్రాన గోదావరి గట్టున కూర్చుని నలుగురు స్నేహితులు కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది’ అని అన్నాడు. నిర్మాత అభినవ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు.
