రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. కృష్ణ పోలూరు దర్శకత్వంలో కె.వి. శ్రీరామ్ నిర్మించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రల్ని పోషించా. అయితే ఈ సిరీస్‌లో చేసిన క్యారెక్టర్ మాత్రం మైల్ స్టోన్‌లా నిలుస్తుంది. ఇందులోని నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి.
ఈ సిరీస్ ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి’ అని చెప్పారు. ఉదయభాను మాట్లాడుతూ ‘ఈ కథకు, పాత్రకు ఓ తల్లిగా కనెక్ట్ అయ్యాను. పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలనే కోరిక ఈ సిరీస్ ద్వారా నెరవేరింది. ఇప్పుడున్న సమాజానికి ఎంతో అవసరమైన సిరీస్ ఇది’ అని చెప్పారు. మంచి ఎమోషన్‌తో సాగే ఈ సిరీస్ ప్రతి కుటుంబాన్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు కృష్ణ పోలూరు అన్నాడు. నిర్మాత కె.వి. శ్రీరామ్ మాట్లాడుతూ ‘ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే సిరీస్ ఇది. ఇందులోని ఒక్కో ఎపిసోడ్ క్లైమాక్స్‌లా ఉంటుంది. చివరివరకు థ్రిల్ మెయింటైన్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు. ఈ సిరీస్‌లో నటించిన గాయత్రి భార్గవి, వాసంతిక, డైలాగ్ రైటర్ శృతి, కెమెరామెన్ మహేష్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
