నిజామాబాద్: నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి కలకలం రేగింది. నలుగురు ఖైదీలు గంజాయి తీసుకున్నట్లు జైలు అధికారులు గుర్తించారు. జైల్లోకి గంజాయి ఎలా వచ్చిందని అధికారులు విచారణ చేస్తున్నారు. రాత్రి వేళల్లో జైలు గోడ నుంచి గంజాయి పొట్లాలను జైల్లో విసురుతున్నారని విచారణలో పోలీసులు తేల్చారు. చాలా రోజులుగా ఈ తతంగం కొనసాగుతోందని తెలిసింది.
ఈ కేసులో.. ఇద్దరు ఖైదీలను బోధన్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు సూచనతో కామారెడ్డి జైలుకు తరలించారు. గంజాయి సేవించిన ఖైదీలను జైలు సిబ్బంది చితకబాదారు. విచారణ సమయంలో తమను జైలు సిబ్బంది కొట్టారని జడ్జికి సదరు ఖైదీలు ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై కోర్టు విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ సెంట్రల్ జైలు పరిస్థితి ఇలా ఉంటే.. చర్లపల్లి సెంట్రల్ జైలు సంస్కరణలు, అప్‌గ్రేడ్‌లతో దేశంలో మోడ్రన్ జైలుగా పేరు తెచ్చుకుని ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్, గంజాయికి బానిసలైన ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
సిబ్బంది వినియోగించని క్వార్టర్స్‌ను ఫంక్షన్ హాల్‌గా మార్చడంతో పాటు అవుట్‌సైడ్ ఎస్కార్ట్ పోలీసు సిబ్బంది కోసం కొత్త విశ్రాంతి గదులు నిర్మించారు. గత నాలుగేండ్లుగా నిలిచిపోయిన 300 మంది ఖైదీల సామర్థ్యంతో కూడిన బ్యారక్ భవన ప్రాజెక్టును తిరిగి ప్రారంభించారు.
