సోలార్​తో పోడుభూములకు సాగునీరు : మంత్రి సీతక్క

సోలార్​తో పోడుభూములకు సాగునీరు : మంత్రి సీతక్క
  • కొత్త సబ్​ స్టేషన్లకు భూమిపూజ చేసిన మంత్రి సీతక్క 

కొత్తగూడ, వెలుగు: సోలార్​ కరెంట్​తో పోడు భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. శనివారం మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లి, గంగారం మండలం కోమట్లగూడంలో రూ.4 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న 11 కేవీ సబ్​ స్టేషన్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన కరెంట్​ను అందించేందుకు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోడు భూములకు సైతం ఐటీడీఏ ద్వారా నిధులు కేటాయించి, ప్రత్యేకంగా సోలార్​విద్యుత్​ ద్వారా బోరు మోటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

 రీ సర్వే చేపించి అర్హులందరికీ పోడు పట్టాలిస్తామన్నారు. అంతకుముందు సాధిరెడ్డిపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న రామలింగేశ్వర గుడికి భూమిపూజ చేశారు. పొగుళ్లపల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రేమేశ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. బత్తులపల్లిలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్​కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్​పీడీసీఎల్​ఎస్ఈ నరేశ్, డీఈ విజయ్, ఏఈ సురేశ్, బ్లాక్​ కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు సుంకరబోయిన మొగిలి, కాంగ్రెస్​ పార్టీ మండలాధ్యక్షులు వజ్జ సారయ్య, వజ్జ వెంకటేశ్వర్లు లీడర్లు పాల్గొన్నారు.