విర్రవీగిన్రు కాబట్టే.. జనం కింద కూసోబెట్టిన్రు : సీతక్క

విర్రవీగిన్రు కాబట్టే.. జనం కింద కూసోబెట్టిన్రు : సీతక్క
  • సీఎంను విమర్శించే స్థాయి కేటీఆర్​కు లేదు : సీతక్క
  • అసెంబ్లీకి రాని కేసీఆర్​కు ఎమ్మెల్యే పదవెందుకని ఫైర్
  • మహబూబాబాద్​ జిల్లాలో గృహజ్యోతి స్కీమ్ ​ప్రారంభం

కొత్తగూడ, వెలుగు : సీఎం రేవంత్​ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్​కు లేదని మంత్రి సీతక్క అన్నారు. తన స్థాయిని పెంచుకునేందుకే రేవంత్​రెడ్డితో కంపేర్​చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. బీఆర్​ఎస్​అధికారంలో ఉన్నప్పుడు తాను మంత్రినని విర్రవీగారని, అందుకే ప్రజలు కింద కూసోబెట్టిన్రని ఆమె ఎద్దేవా చేశారు. దురహంకారంతోనే సీఎం రాజీనామా చేయాలని అంటున్నారని ఫైర్​ అయ్యారు. ప్రజలే రేవంత్​కు సీఎం పదవి ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.

శుక్రవారం ఆమె మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బావురుగొండలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి వినియోగదారులకు జీరో బిల్ అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు​పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. మొదటి విడత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చని బీఆర్ఎస్​ పార్టీ.. 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయిందని

వాటికి ఏటా 70 వేల కోట్లు వడ్డీ కట్టాల్సివస్తున్నదన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో 75 రోజులు కూడా పూర్తి కాని కాంగ్రెస్​ పాలనను విమర్శించడం వాళ్లకు కరెక్ట్​కాదు. విమర్శలు సద్వివిమర్శలుగా ఉండాలే కాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు” అని ఆమె సూచించారు. కాంగ్రెస్​ ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఫారెస్ట్​ నిభందనలతో ఏజెన్సీలో అభివృద్ధి పనులు జరగడం లేదని

కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్​ చట్టాలను ​సవరించాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం కేంద్రంలోనూ కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని తీసుకు రావాలని కోరారు. సాయంత్రం కొత్తగూడలోని రైతు వేదికలో జిల్లా, మండల స్థాయి ఆఫీసర్లతో మంత్రి రివ్యూ నిర్వహించారు. రెండు మండలాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని మిషన్​ భగీరథ ఆఫీసర్లను ఆదేశించారు.