
- తల్లుల గద్దెల్లో ఎలాంటి మార్పుల్లేవ్: మంత్రి సీతక్క
- యూపీ కుంభమేళాలో వసతులు కల్పించిన ఏజెన్సీల సలహాలు తీసుకుంటామని వెల్లడి
- మేడారం ఆలయ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా మేడారం ఆధునికీకరణ పనులు చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణ పనులపై శనివారం సెక్రటేరియెట్ లో అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. భక్తుల సౌకర్యాలు, ఆలయ పరిసరాల అభివృద్ధి కోసం చేపట్టే మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. జాతరకు వచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆధునికీకరణ పనుల ప్రణాళికపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయగా.. మంత్రి సీతక్క పలు మార్పులను సూచించారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఆలయ ఆవరణలో చేపట్టాలన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీల సంప్రదాయాలు, తల్లుల ధైర్యసాహసాలు ప్రతిబింబించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర వైద్యసేవలు, భద్రతా ఏర్పాట్లు, మీడియా ప్రతినిధులకు అవసరమైన వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో భక్తుల కోసం ఘాట్లను నిర్మిస్తామన్నారు. వారం రోజుల్లో గద్దెల చుట్టూ ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసి, పూజారుల ఆమోదంతో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. యూపీ కుంభమేళాలో వసతులు కల్పించిన ఏజెన్సీలను సంప్రదించి వారి సలహాలు తీసుకుని భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ జి.సృజన, ములుగు కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ నగర్ ఖిల్లా మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.