
- ఆడబిడ్డను అరిగోస పెట్టడం
- కేటీఆర్కు తగదు: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: మహిళలతో పెట్టుకున్నోళ్లు ఎవరూ జీవితంలో బాగుపడలేదని, సొంత ఇంటి ఆడబిడ్డను అరిగోస పెడుతున్న తీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏమాత్రం తగదని మంత్రి సీతక్క అన్నారు. ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న భారీ బతుకమ్మ వేడుకల విజయవంతం కోసం గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలతో సీతక్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన బతుకమ్మ ఆట, పాట నమోదు అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నదని, దీన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు బతుకమ్మను తామే నేర్పించామని కొంత మంది ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణ అనేది ఉనికిలో ఉన్నప్పటి నుంచి బతుకమ్మ ఆట, పాట ఉందన్నారు. బతుకమ్మలో కొత్త సంస్కృతులు వద్దని, దాండియా వంటి ఆటలను గత పాలకులు మనపై రుద్దారని ఆమె ఆరోపించారు. తెలంగాన మహిళలు సంతోషంగా ఉంటే ఓర్వలేని వాళ్లు తమను కించపరిచే పాటలు పాడుతూ ఊరేగుతున్నారని మండిపడ్డారు.