ఈశ్వరమ్మ కేసులో దోషులు ఎంతటి వారైనా వదలం : సీతక్క

ఈశ్వరమ్మ కేసులో దోషులు ఎంతటి వారైనా వదలం : సీతక్క
  • మంత్రి సీతక్క చెంచు మహిళకు పరామర్శ 

పంజగుట్ట, వెలుగు : నాగర్​కర్నూల్ ​జిల్లాలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై దాడిచేసి హింసించిన మానవ మృగాలు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా వదిలేది లేదని, కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ ​శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. కొద్ది రోజులుగా హైదరాబాద్​ నిమ్స్ ​దవాఖానలో చికిత్స పొందుతున్న నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ ​నియోజకవర్గంలోని మూల చింతలపల్లికి చెందిన చెంచుమహిళ ఈశ్వరమ్మను మంత్రి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధిత మహిళ కుటుంబానికి సంపూర్ణ రక్షణ కల్పిస్తామని, ఈ విషయంలో ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఐటీడీఏ, ఎస్సీ, ఎస్టీ శాఖల నుంచి రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించామన్నారు. దీంతో పాటు ఉమెన్ ​అండ్​ చైల్డ్​వెల్ఫేర్ ​నుంచి రూ.25 వేల చెక్కును ఈశ్వరమ్మ కుటుంబసభ్యులకు అందజేశారు. బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని నిమ్స్ ​డైరెక్టర్ ​ఎన్​.బీరప్పను ఆదేశించారు. తన మామ నాగయ్య అనుమానస్పదంగా చనిపోయాడని ఈశ్వరమ్మ మంత్రికి చెప్పడంతో సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.  దీంతో పోలీసులు రంగంలోకి దిగి కొల్లాపూర్​ పరిధిలో ఖననం చేసిన శవాన్ని బయటకు తీసి రీ పోస్ట్​మార్టం నిర్వహించారు.