- బీఆర్ఎస్ లెక్క మేం ప్రొసీజర్‌లో ఇన్వాల్వ్ కాం..కేసులో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు: మంత్రి శ్రీధర్ బాబు
- ఎవరు ఎవరి తాట తీస్తరో ఎన్నికల తర్వాత తెలుస్తది
- పాలన మొదలై మూడు నెలలుకాగానే మాపై పడుతున్నరు
- మేం అందరి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం
- ఉమ్మడి ఏపీలో కన్నా దారుణంగా ఫోన్లు ట్యాప్ చేశారు: పొన్నం
- తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌పై చట్టం, న్యాయానికి తగినట్టే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పద్ధతి ప్రకారం విచారణ జరుగుతుందని, ఆ ప్రొసీజర్‌లో వారిలాగా(గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా) తాము ఇన్వాల్వ్ కాబోమని చెప్పారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నేతృత్వంలోనే పాలన జరుగుతున్నదని, ఎన్నికల కోడ్‌కు తగ్గట్టుగానే తాము మాట్లాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి తాట తీశారో అందరికీ తెలుసని, పార్లమెంట్ఎన్నికల తర్వాత ఎవరు ఎవరి తాట తీస్తారో కూడా తెలుస్తుందని ఆయన కేటీఆర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు గురువారం పరిశీలించారు.
సభ ఏర్పాట్లపై అక్కడే సీఎం రేవంత్ రివ్యూ చేశారు. అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సభ నుంచే కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్టు శ్రీధర్‌బాబు చెప్పారు. సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నేతలు హాజరవుతున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు సోనియా గాంధీ ఇక్కడ ఆరు గ్యారంటీలను ప్రకటించారని, ఇప్పుడు ఇదే తుక్కుగూడ నుంచి జాతీయ స్థాయి మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జనజాతర సభపై 17 లోక్‌సభ సెగ్మెంట్ల ఇన్చార్జు, ఇప్పటికే ప్రకటించిన 14 సెగ్మెంట్ల అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారని తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జులు, పోటీలో ఉన్న అభ్యర్థులంతా గ్రామస్థాయి, మండల స్థాయి నుంచి జనాల్ని సభకు తీసుకురావాలని ఆయన సూచించారు.
వాళ్లకు ఓపిక లేదు
కాంగ్రెస్ పాలన మొదలై మూడు నెలలే అయిందని.. రైతన్నలు, నేతన్నలు, విద్యార్థులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని, దీనిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అధికారాన్ని కోల్పోయామన్న ఆలోచనలోనే బీఆర్ఎస్ నేతలు ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వ పాలనను చూద్దామన్న ఓపిక కూడా వారికి లేకుండా పోయిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో చేనేత కార్మికులకు రూ.400 కోట్ల బకాయిలు పెట్టారని, పదేండ్లపాటు వారి సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వారికి ఇన్నేండ్లూ పేమెంట్లు ఎందుకు చేయలేదని నిలదీశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్( కేఆర్ఎంబీ) మీటింగ్‌కు సంబంధించిన విషయంపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి వివరాలు తీసుకున్నారని, దానిపై ఆయనే చెప్తారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించుకునుడేంది?: పొన్నం ప్రభాకర్
ఉమ్మడి ఏపీలో కన్నా దారుణంగా రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు, సొంత పార్టీలోని నేతలను కూడా అణచివేసేందుకు, ఉద్యమాలను తొక్కి పెట్టేందుకు అత్యంత నీచంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్లను ట్యాప్ చేశారన్నాం.. అది నిజమే.
కానీ, ఉద్యమకారుడిగా రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటే బాగుండేది. అట్ల చేశారా? అంతకన్నా ఎక్కువగా ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను అణచివేసేందుకు వాడుకున్నారు. పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు. ఒకరిద్దరు లంగలపై ఫోన్ ట్యాప్ చేస్తే తప్పేందన్నట్టు మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో ప్రజల ప్రైవసీ హక్కులు, రాజ్యాంగ హక్కులను కాలరాయడం నిజం కాదా? ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారో చెప్పాలి. ఒకరిద్దరు లంగల ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పిన ఆయన(కేటీఆర్).. తనకు సంబంధం లేదని ఎట్ల అంటరు?’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. తప్పులను అధికారులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.