రిచ్‌కల్చర్ పేరుతో తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దు స్టూడెంట్లకు మంత్రి సీతక్క సూచన

రిచ్‌కల్చర్ పేరుతో తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దు స్టూడెంట్లకు మంత్రి సీతక్క సూచన

ముషీరాబాద్, వెలుగు: రిచ్ కల్చర్ పేరుతో తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దని స్టూడెంట్లకు మంత్రి సీతక్క సూచించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని.. కొద్దిపాటి ఆనందం కోసం జీవితాలను పాడుచేసుకోవద్దని కోరారు. గురువారం తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీతక్క పాల్గొని, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ‘‘నేనూ ప్రభుత్వ బడిలోనే చదువుకున్నాను. 

ఇప్పుడు నన్ను చూసి మా టీచర్లు సంతోషపడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు గ్రేట్ గా ఫీల్ కావాలి తప్ప బాధ పడొద్దు. గొప్ప విషయాలను నేర్చుకుని ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఎదగండి. హెల్త్, ఎడ్యుకేషన్​పై ప్రభుత్వం స్పెషల్​ఫోకస్ పెట్టింది. స్కూల్ విద్య బలోపేతానికి కృషి చేస్తున్నది. ప్రభుత్వ స్కూళ్లల్లో లోపాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. 

సలహాలు, సూచనలు ఇవ్వండి. సమాజ నిర్మాణం బడి ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే స్టూడెంట్ల పట్ల టీచర్లు జాగ్రత్తగా ఉండాలి" అని సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ రోహిణి, సుద్దాల అశోక్ తేజ, అక్కెల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.