అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపిన్రు : సీతక్క

అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపిన్రు : సీతక్క
  • దేవుళ్లు, మతాల పేరుతో ఓట్లడుగుతున్న బీజేపీ 
  • వంద రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేసినం

భైంసా, వెలుగు: కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎక్కడా అభివృద్ధి చేయలేదని,  ఇంటింటికీ అక్షింతలు మాత్రం పంపించిందని  పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. ఆదివారం నిర్మల్​జిల్లా భైంసాలోని గౌరీశంకర్​ ఫంక్షన్​ హాల్‌లో నిర్వహించిన పార్లమెంట్​ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఖానాపూర్​ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి చీఫ్‌ గెస్టుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఆ పార్టీ లీడర్లు దేవుళ్లు, మతం పేరుతో  ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎన్నికలకు ముందు పేదల అకౌంట్లో  రూ. 15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మోదీ  రూ. 10 వేలు కూడా వేయలేదని మండిపడ్డారు.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసి చూపించామని స్పష్టం చేశారు.  30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.

 ఇటీవల ఆదిలాబాద్‌కు వచ్చిన ప్రధాని రాష్ట్రానికి వరాలు ఇస్తాడని అనుకుంటే.. కాంగ్రెస్​పై ఏడ్చి వెళ్లారని విమర్శించారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో ఆదిలాబాద్​ ఎంపీ సీటును భారీ మెజార్టీతో గెలిపించి.. రాహుల్​ గాంధీ, సీఎం రేవంత్​ రెడ్డికి గిఫ్ట్​ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖానాపూర్​ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సిరిసిల్ల, సిద్దిపేటలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. బీజేపీ మతం, శ్రీరాముడు, హన్మంతుడి పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుందని, తమకు బీజేపీ కంటే ఎక్కువగా దేవుళ్లపై నమ్మకం ఉందన్నారు. 

పెండింగ్​ సమస్యలు పరిష్కరించండి 

ముథోల్​ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి మంత్రి సీతక్కను కోరారు. పల్సికర్​ రంగారావు ప్రాజెక్టు బ్యాక్​ వాటర్‌‌తో పదేళ్లకు పైగా గుండెగాం గ్రామం ముంపునకు గురవుతుందని వాపోయారు. గత ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేయగా.. ఫైనాన్స్​డిపార్ట్​మెంట్‌లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ నిధులను విడుదలయ్యేలా చూడాలని కోరారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న సిరాల ప్రాజెక్టు గతేడాది భారీ వర్షాలకు తెగిపోయిందని, రూ. 16 కోట్ల నిధులు సైతం విడుదలయ్యాయని, త్వరగా పునర్నిర్మించాలని కోరారు.

ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఉన్న వసతులు స్థానిక గిరిజనులకు  కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి.. సీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీచ్చారు.  అనంతరం బీఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు.  ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యే నారాయణ్​ రావు పటేల్, జిల్లా ఇన్‌చార్జి సత్తు మల్లేశ్, లీడర్లు ఆనంద్​ రావు పటేల్​, ఓం ప్రకాష్​ లడ్డా, బుచ్చన్న, బాశెట్టి రాజన్న పాల్గొన్నారు.