పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు : మంత్రి సీతక్క

పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు : మంత్రి సీతక్క
  • త్వరలో ములుగులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం

ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు: పిల్లలు తల్లిదండ్రులకు భారం కావద్దని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో నిలదొక్కుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ములుగులో 1500 మంది నిరుద్యోగులకు వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. బుధవారం మంత్రి సీతక్క ములుగు, వెంకటాపూర్ మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

మంత్రి చొరవతో  52 కార్పొరేట్ కంపెనీలతో ములుగులో మెగా జాబ్ మేళాను కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, అడిషనల్ కలెక్టర్ శ్రీజతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఉద్యోగ అవకాశాలను పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ములుగు వెనకబడిన జిల్లా అని ఎవ్వరినోటా వినపడొద్దన్నారు. త్వరలోనే జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు.  అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్, మండలాధ్యక్షుడు చాంద్ పాష తదితరులు పాల్గొన్నారు.

సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిద్దాం

సమాజం నుంచి సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిద్దామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బుధవారం ములుగు జిల్లా ఆస్పత్రిలో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి వచ్చిన వారికి, నిర్ధారణ జరిగిన వారికి, కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో వైద్య సిబ్బంది డాక్టర్లు అవగాహన కార్యక్రమాలు, రోగనిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. 

కలెక్టర్ దివాకర మాట్లాడుతూ యుక్త వయసు అమ్మాయిల్లో ఎక్కువగా సికిల్ సెల్ వ్యాధి వస్తుందని, జిల్లాలో 2300 మందికి పరీక్షలు నిర్వహించగా, 20 మందికి వచ్చిందని, ఈ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షల సెల్ లో మంత్రి సీతక్క రక్త పరీక్ష నమూనా ఇచ్చి పని తీరును పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంఅండ్ హెచ్​వో అప్పయ్య, జిల్లా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్​లాల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

మిషన్ భగీరథ పైపులైన్ పనులు ప్రారంభం

రాష్ట్రంలోనే  ములుగు జిల్లాను ప్రగతిపథంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలని మంత్రి సీతక్క అన్నారు. వెంకటాపూర్ మండల కేంద్రంలో రూ.49.53 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ అంతర్గత తాగునీటి పైపులైన్ నిర్మాణాన్ని కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీజలతో కలిసి మంత్రి ప్రారంభించారు.