- ట్రైసిటీస్ హాఫ్ మారథాన్- 2026లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే
- భద్రకాళి ఆలయంలో వాహనోత్సవ రథం ప్రారంభం
వరంగల్, వెలుగు: వరంగల్ సిటీ అభివృద్ధి కోసం ఐటీ టవర్ల నిర్మాణానికి కృషి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. శనివారం ఆయన గ్రేటర్ వరంగల్లో పర్యటించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజుతో కలిసి నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైసిటీస్ హాఫ్ మారథాన్-– 2026లో భాగంగా 5కే రన్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ నగరంలో ఐటీ టవర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నాయిని పలుమార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రతిపాదనలను పరిశీలించి, ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం వేగంగా విస్తరిస్తోందని, ఇక్కడ భారీ ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ యోగా, శారీరక వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, క్రీడలు, ఉద్యోగ రంగాల్లో రాణించాలని సూచించారు.
భద్రకాళి ఆలయానికి ‘ఉత్సవ రథం’ అందజేత..
ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో సేవల కోసం రూపొందించిన 36 అడుగుల ప్రత్యేక రథాన్ని మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆలయానికి అందజేశారు. భద్రకాళి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా వాహనసేవలకు అవసరమైన రథం లేకపోవడంతో ఎమ్మెల్యే నాయిని దాతల సహకారంతో రూ.కోటి వ్యయంతో దీనిని తయారు చేయించారు. రథం తయారీ పూర్తికావడంతో మంత్రి, ఎమ్మెల్యే ఆలయానికి అందజేశారు. అనంతరం ఇరువురూ తాడుతో రథాన్ని లాగి ప్రారంభించారు. తర్వాత మంత్రి వెయ్యిస్తంభాల గుడి, పద్మాక్షి ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
