నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉంటా .. టీజీవో నేతలతోమాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉంటా .. టీజీవో నేతలతోమాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 
  • వారితో  స్టార్ హోటల్​లో రహస్య భేటీ 
  • మీటింగ్ నుంచి వెళ్లాక మాజీ మంత్రి తీరుపై నేతల ఫైర్ 

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల(టీజీవో) సంఘం నాయకత్వ మార్పుపై లొల్లి మొదలైంది. సర్కారు మారడంతో అధ్యక్ష, కార్యదర్శుల పోస్టుల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. దీనిపై జిల్లాల్లోనూ విమర్శలు పెరగడంతో ముఖ్య నేతల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి టీజీవో ముఖ్య నేతలతో మాజీ మంత్రి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్​గౌడ్ మాదాపూర్ లోని ఓ స్టార్ హోటల్ లో రహస్య మీటింగ్ నిర్వహించారు.

ఇందులో ప్రధానంగా టీజీవో స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు మార్పుపై చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రధాన కార్యదర్శికి లేదా నగరంలోని ముఖ్యనేతకు ఆ బాధ్యత ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే.. ఈ ప్రతిపాదన తెచ్చిన నేతలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. “గత 9 ఏండ్లుగా యూనియన్ నేతలకు ఎంతో చేసిన. మీరు ఎక్కడ అడిగితే అక్కడ పోస్టింగ్​లు ఇప్పించిన. ఎంత బిజీగా ఉన్నా మీకు టైమ్ ఇచ్చిన. పలుమార్లు తిరుపతితో పాటు విదేశీ టూర్లకు తీసుకపోయా”అంటూ నేతలతో ఆయన చెప్పినట్టు తెలిసింది. తానే సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉంటానని  శ్రీనివాస్​గౌడ్ చెప్పినట్టు సమాచారం.

ఇంకా ఎన్నేండ్లు పెత్తనం

మీటింగ్ టైమ్ లో శ్రీనివాస్​గౌడ్ ప్రతిపాదనకు ఒకే చెప్పిన టీజీవో  నేతలు.. ఆయన వెళ్లిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతున్నది. ఇంకా ఎన్నేండ్లు సంఘంలో వారి పెత్తనం ఉండాలంటూ నేతలు చర్చించుకున్నట్టు తెలిసింది. వెంటనే గౌరవ అధ్యక్షుడితో పాటు అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న వ్యక్తిని తప్పించాలని నేతలు చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ సర్కారు హయాంలో  చాలా సమస్యలపై ఏం మాట్లాడలేని పరిస్థితి ఉండేదని, దీంతో కిందిస్థాయిలో సంఘంపై తీవ్ర నిరసన వ్యక్తమయ్యిందని చర్చ జరిగినట్టు తెలిసింది.

పీఆర్సీ, డీఏలు, జీవో 317, బదిలీలు, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టం రప్పించడం వంటి సమస్యలను పరిష్కారం చేయలేదని, సీఎం దగ్గర ప్రస్తావించలేదని నేతలు అన్నట్లు సమాచారం. త్వరలోనే యూనియన్ మీటింగ్ పెట్టి చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా, దీనిపై సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మమతను వివరణ కోరగా.. తనకు మీటింగ్ విషయం తెలియదని, తాను దానికి అటెండ్ కాలేదని పేర్కొన్నారు.