వ్యాపారం కోసమే నడుపుతున్న విద్యాసంస్థలకు చెక్ పెట్టాల్సిందే

వ్యాపారం కోసమే నడుపుతున్న విద్యాసంస్థలకు చెక్ పెట్టాల్సిందే

వ్యాపారం కోసమే నడుపుతున్న విద్యాసంస్థలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలను కొందరు వ్యాపార సంస్థలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. పలానా సంస్థలో చదివితేనే మంచి మార్కులు వస్తాయనే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మహబూద్ ఆలీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష..

కేంద్రం తెలంగాణపై వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విద్యాశాఖకు ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం విడుదల చేయడం లేదని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో బీజేపీయే ఉండాలనే ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కొత్త రాష్ట్రం కాబట్టి మొదట సంక్షేమంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. ఇప్పుడు విద్యారంగంపై ఫోకస్ చేస్తున్నారని వెల్లడించారు. వర్సిటీల్లో వైస్ ఛాన్సలర్స్ అందరూ మచ్చ లేకుండా పని చేయాలన్నారు. ఒక ఉపాధ్యాయుని కుమారుడిగా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పిల్లల ఎదుగుదలలో టీచర్ల బాధ్యత ఎంత ఉందో..తల్లితండ్రుల పాత్ర కూడా అంతే ఉంటుందన్నారు.
విద్యాసంస్థల్లో పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 

ఉన్నత విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తం..

పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే ఉపాధ్యాయులు అవుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా సమయంలో టీచర్లు చేసిన కృషిని  సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. విద్యావ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు తిరిగి చూస్తోందన్నారు. తెలంగాణలో పేరెంట్స్ ..ప్రయివేట్ స్కూల్స్ లో  అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకుని ప్రభుత్వ స్కూళ్లకి తమ పిల్లలను పంపుతున్నారు. విద్యా విధానంలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ చెప్తూ ఉంటారన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని వెల్లడించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు పెట్టాలని సీఎం సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో అందరు భాగస్వామ్యం కావాలని సూచించారు. రాష్ట్రం విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నా..కేంద్రం నుండి అభినందన, సహకారం ఉండటం లేదన్నారు. చట్ట పరంగా రావాల్సిన నిధులు కూడా కేంద్రం విడుదల చేయడం లేదని మండిపడ్డారు. 

మంచి టీచర్లతోనే మంచి సమాజం..

మంచి టీచర్లు ఉన్న దగ్గర మంచి సమాజం ఏర్పడుతుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అబ్దుల్ కలాం తాను టీచర్ కావాలని కోరుకున్నారని చెప్పారు. ఇటు తెలంగాణలో విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల నుంచి తీసి ప్రభుత్వ స్కూళ్ళలో వేస్తున్నారన్నారు.