కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి కేటీఆరే సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని స్పష్టం చేశారు. కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ బీజేపీని ఎదుర్కొనేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని చెప్పారు. ఆ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని స్పష్టం చేశారు. వందకు వంద శాతం రాష్ట్రానికి నెక్ట్స్ సీఎం కేటీఆరే అని..ఈ విషయాన్ని పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. 

ఛీ కొడుతున్నా బుద్దిరావడం లేదు..

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ నేతల మాటతీరు సరిగ్గా  లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్తూ...అబద్దపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీని ఛీ కొడుతున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. ఎన్నికల కమిషన్‌.. కేంద్రం తమ చేతుల్లో ఉందని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  కారును పోలిన గుర్తులు వద్దంటున్నా ..అవే కేటాయించేలా చేసి బీజేపీ తొలి కుట్రకు తెరలేపిందన్నారు. మునుగోడులో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా..గెలిచేది టీఆర్ఎస్సే అన్నారు. 

గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు..

8 ఏండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అబద్దపు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. అవే హామీలను ఇప్పుడు మునుగోడులో ఇస్తోందన్నారు. తెలంగాణలో మత కల్లోలాలు రేపేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.  మత ఘర్షణలతో ఓట్లు దండుకోవడం తప్ప బీజేపీకి ఏమీ చేతకాదన్నారు.