ఆసియా ఖండంలోనే సర్వాయి పాపన్న గొప్ప వీరుడు

ఆసియా ఖండంలోనే సర్వాయి పాపన్న గొప్ప వీరుడు
  • సర్దార్  సర్వాయి పాపన్న గొప్ప వీరుడు
  • మంత్రి  శ్రీనివాస్ గౌడ్
  • రేపు రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జయంతి ఉత్సవాలు

ముషీరాబాద్,వెలుగు: కుల వృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పాపన్న 372వ జయంతి వేడుకలు చిక్కడపల్లిలోని రాష్ట్ర ఆఫీసులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్  చీఫ్ గెస్టులుగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే పాపన్న గొప్ప వీరుడని కొనియాడారు.

మంచి రాజుగా గుర్తింపు పొందిన సర్దార్‌‌ సర్వాయి పాపన్న గౌడ్‌‌ చరిత్రను లండన్‌‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ గుర్తించినా ఇక్కడి పాలకులు ఇంకా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఈనెల18న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా పాపన్న జయంతి వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు. పాపన్న స్ఫూర్తితో బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాడాలని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ అన్నారు.

ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ కన్వీనర్ ఆయిల వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ గడ్డమీద విజయ్ కుమార్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీలు బూర నరసయ్య గౌడ్,  హనుమంతరావు, విప్లవ గాయని విమలక్క, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, ఎంవీ రమణ, బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు.