జింఖానా బాధితులకు మంత్రి శ్రీనివాస్ పరామర్శ

జింఖానా బాధితులకు మంత్రి శ్రీనివాస్ పరామర్శ

హైదరాబాద్: భారత్–ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం ప్రయత్నించి తొక్కిసలాటలో గాయపడిన వారిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో రంజిత, సుజాత, అలియా, శ్రీకాంత్, ఆదిత్య నాథ్, సాయి కార్తీక్ లు గాయపడ్డారన్నారు. వారందరికీ ప్రభుత్వం తరఫున చికిత్స అందించామని మంత్రి తెలిపారు. వారికి క్రీడా శాఖ తరఫున ఇవాల్టి భారత్–ఆస్ట్రేలియా మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అందించామని, అలాగే ప్రభుత్వ వాహనంలో వారిని స్టేడియానికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

తొక్కిసలాటలో గాయపడిన మహిళను కాపాడిన మహిళా కానిస్టేబుల్ నవీనను మంత్రి అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళ ప్రాణాలను కాపాడిన నవీనకు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ ఇవ్వాలని డీజీపీకి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. క్రీడాభిమానుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని,  టికెట్ల గోల్ మాల్ పై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.