మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశాం : తలసాని

మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశాం : తలసాని

మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫ్లోడైడ్ స‌మ‌స్యను ప‌రిష్కరించాల‌ని నాటి ప్రభుత్వాలను కోరితే ప‌ట్టించుకోలేద‌న్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడింద‌ని పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నిక ఒక వ్యక్తి స్వార్ధం కోసమే వచ్చిందన్నారు.  హుజురాబాద్, దుబ్బాకలో గెలిచాక బీజేపోళ్లు ఎన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. 

మునుగోడులోని నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తలసాని పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం ఉందని.... టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో  జిల్లా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మ‌ద్దతు తెలిపి, కూసుకుంట్ల ప్రభాక‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని త‌ల‌సాని పిలుపునిచ్చారు.

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేపు (అక్టోబర్13న) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లెఫ్ట్ పార్టీల నేతలకు కూడా టీఆర్ఎస్ ఆహ్వానం పంపింది. మరోవైపు బీజేపీ అభ్యర్ధిగా ఈ నెల 10వ తేదీన  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  నామినేషన్ దాఖలు చేయగా, ఈ నెల 14న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 03న ఉపఎన్నిక జరగనుండగా, 06న ఫలితాలు వెలువడనున్నాయి.