సినీకార్మికుల ఆందోళన ఉధృతం కాకముందే పరిష్కరించండి

సినీకార్మికుల ఆందోళన ఉధృతం కాకముందే పరిష్కరించండి

కరోనా వల్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ లు కార్మికులను చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని చెప్పారు. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని, కరోనా సమయంలో షూటింగ్ లు లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు.  సినీ కార్మికుల రెమ్యునరేషన్ కు సంబంధించి మూడేళ్లపాటు ఒప్పందం ఉంటుందని, కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయంపై  ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసినందున రెమ్యునరేషన్ పెంచాలన్నారు. కార్మికులు చేపట్టిన ఆందోళన ఉధృతం కాకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి 2,3 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.