వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి: మంత్రి తలసాని

వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి: మంత్రి తలసాని

'యువతా మేలుకో' అన్న వివేకానందుని మాటలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కోఠి ఇసామియా బజార్ లో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బోగారపు దయానంద్ గుప్తా, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ తో కలిసి వివేకానంద విగ్రహానికి మంత్రి తలసాని పూలమాల వేసి నివాళులర్పించారు. 

యువతకు సేవా మార్గం... వివేకానందుడే స్ఫూర్తి మంత్రం అని అన్నారు. యువత, విద్యార్థులు స్వామి వివేకానందుడు చూపిన బాటలో నడవాలని మంత్రి కోరారు. ఇతరుల పట్ల సేవా భావాన్ని అలవర్చుకొని... వివేకానంద సందేశాన్ని తు.చ. తప్పక పాటించాలన్నారు. విశ్వమత సభల ద్వారా దేశ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఎంతో మంది స్వామి వివేకానంద సాహిత్యం వల్లే గొప్పవారయ్యారని ఆయన పేర్కొన్నారు. యువత పరాయి దేశాల సంస్కృతిని వీడి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.