అమ్మవారి విగ్రహంపై వస్తున్న ప్రచారం నమ్మొద్దు 

అమ్మవారి విగ్రహంపై వస్తున్న ప్రచారం నమ్మొద్దు 

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ బోనాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో.. జరుగుతున్న ప్రచారంపై మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహం విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మరని, విగ్రహం జరిపే ధైర్యం ఎవరూ చేయరని తెలిపారు. ఈ ప్రచారం చేసిన వారిని అమ్మవారే చూసుకుంటారన్నారు. ఇలాంటి ప్రచారం వారిని అమ్మవారే శిక్షిస్తారని చెప్పారు. దేవాలయంలో చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే చేస్తారని, ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని సూచించారు. అందరి అభిప్రాయాలను తీసుకుని బోనాల జాతర నిర్వహిస్తామని, ఏ విషయంలో సందేహాలున్నా.. తమను సంప్రదించాలన్నారు. మంచి.. చెడు విషయాలను ఎండోమెంట్ అధికారులు, అర్చకులు చూసుకుంటారని తెలిపారు. 

కలరా వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోతే.. ఉజ్జయినికి వెళ్లి అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్టించారని చెబుతుంటారని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని.. బోనాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని.. గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బాటా నుంచి జేమ్స్ స్ట్రీట్.. రాణిగంజ్ వరకు రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.