అన్ని రకాల విగ్రహాలనూ నిమజ్జనం చేయొచ్చు

అన్ని రకాల విగ్రహాలనూ నిమజ్జనం చేయొచ్చు

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినా.. ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ) విగ్రహాలు కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయాలని గత కొంతకాలంగా చెబుతున్నామని అన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని శాఖల అధికారులు ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేశారని చెప్పారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తూ హైదరాబాద్ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని, భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక రాష్ట్రంలో 8 ఫీట్ల గణేష్ విగ్రహాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. 

నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన..

‘‘మట్టి వినాయకులను మాత్రమే నిమజ్జనం చేయాలని ఎక్కడా లేదు... అన్ని రకాల వినాయక విగ్రహాలను కూడా నిమజ్జనం చేయొచ్చు’’ అని తలసాని వ్యాఖ్యానించారు.మీరే హిందువులు అయితే మేము ఎవరు..? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనలతోనే ఖైరతాబాద్‌ వినాయకుడిని మట్టితో తయారు చేశారని చెప్పారు. దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. అంతకుముందు ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.