హంగ్ వచ్చే చాన్స్​ లేదు..మేమే గెలుస్తాం: మంత్రి తలసాని

హంగ్ వచ్చే చాన్స్​ లేదు..మేమే గెలుస్తాం: మంత్రి తలసాని
  • చలి మంటలు వేసుకుంటే సెక్రటేరియెట్​​లో అగ్నిప్రమాదం జరిగింది
  • అది ఏమంత సీరియస్​ కాదు.. కావాలనే పెద్దది చేస్తున్నరు
  • కడప స్టీల్​ ప్లాంట్​ ఓపెనింగ్​కు అనుమతిచ్చిన కేంద్రం ..మన సెక్రటేరియెట్​ ఓపెనింగ్​కు ఇయ్యలే 
  • తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపణ
  • రేపు జీహెచ్​ఎంసీలో కేసీఆర్​ బర్త్​డేను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటన
 
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హంగ్ వచ్చే చాన్స్​ లేదని, నూటికి నూరు శాతం తామే గెలుస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి స్టాండర్డ్స్​ లేని వ్యక్తి.. ఆయన గంటకో మాట మాట్లాడుతున్నడు.. హంగూ రాదు.. బొంగు రాదు.. వన్​సైడెడ్​గా 2018లో ఎట్లా గెలిచినమో అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తం..” అని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, సెక్రటేరియెట్​అద్భుత నిర్మాణాన్ని చూసి కొంత మంది ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ‘‘సెక్రటేరియెట్​ దగ్గర పని చేసే కార్మి కులు చలిమంటలు వేసుకుంటే అగ్ని ప్రమాదం జరిగింది. అది ఏమంత సీరియస్​ కాదు. కొందరు దాన్ని కూడా పెద్దది చేసి చూపించే ప్రయత్నం చే స్తున్నరు” అని కామెంట్​ చేశారు. బుధవారం తె లంగాణ భవన్​లో మీడియాతో తలసాని మాట్లాడారు. కడపలో స్టీల్ ప్లాంట్​ప్రారంభోత్సవానికి సీఎం జగన్​కు అనుమతిచ్చిన కేంద్రం మన సెక్రటేరియట్​ ప్రారంభానికి పర్మిషన్​ ఇవ్వలేదన్నారు. 


కాంగ్రెస్​తో పొత్తు ఉండదు

 
తెలంగాణలో ఎవరిపై ఆధారపడాల్సిన​ అవసరం లేకుండానే బీఆర్​ఎస్​ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తలసాని చెప్పారు. కాంగ్రెస్​తో పొత్తు అనే మాటే తలెత్తదన్నారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి విశ్వసనీయత లేదని, ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని తెలిపారు. ‘‘పార్టీ మారిన వాళ్లు.. బీఆర్​ఎస్​ను వీడిన వాళ్లు ఎట్ల ఉన్నరో ప్రజలు చూస్తున్నరు. వాళ్లు మళ్లీ వస్తామన్నా ఇక్కడ బండి ఫుల్​ లోడ్​తో ఉంది” అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి నోరుంది కదా అని తాడుబొంగరం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని తలసాని దుయ్యబట్టారు. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి అంబర్​పేటకు కిషన్​రెడ్డి ఏమీ చేయలేదని విమర్శించారు. అంబర్​పేట అభివృద్ధిపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​తో కిషన్​రెడ్డి చర్చకు సిద్ధమా అని సవాల్​ చేశారు. కేంద్ర బడ్జెట్​గురించి సీఎం కేసీఆర్​ అసెంబ్లీలోనే కుండబద్దలు కొట్టారని, ఇంకా దానిపై తాను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.  ఈటల రాజేందర్​ బీఆర్ఎస్​లోకి వస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలని పేర్కొన్నారు. 
 

ఘనంగా కేసీఆర్ ​బర్త్​డే

 
శుక్రవారం కేసీఆర్​ బర్త్​డే వేడుకలు జీహెచ్ఎంసీలోని అన్ని డివిజన్స్​లో నిర్వహిస్తామని తలసాని తెలిపారు. వేడుకలపై తెలంగాణ భవన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ తదితరులతో ఆయన సమీక్షించారు. అన్ని మతాల ప్రార్థన మందిరాలు, ఆలయాల్లో ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, సికింద్రాబాద్​ గణేశ్​ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.