రూ. 200 పెన్షన్ రూ.2016 చేసింది కేసీఆరే : తలసాని

రూ. 200 పెన్షన్  రూ.2016  చేసింది కేసీఆరే : తలసాని

నాగార్జున సాగర్, హుజురాబాద్ లో ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో.. అదే విధంగా మునుగోడును కూడా అభివృద్ధి చేసుకుందామని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా హైదరాబాద్ లో నివసిస్తున్న.. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి టౌన్, మర్రిగూడ కు చెందిన ఓటర్లతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఎంత అభివృద్ది జరిగిందో ప్రజలందరికీ తెలుసని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం జరుగుతుందన్నారు. భారతదేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. 

సంక్షేమ పథకాల అమలు

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని అందిస్తున్నామని మంత్రి తలసాని అన్నారు. పేద ప్రజలు తమ పిల్లలకు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతుంటే.. తెలంగాణ రాష్ట్రం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా మైనార్టీలకు సహాయం అందిస్తోందని చెప్పారు. అలాగే గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్టు ఇస్తున్నామని అనేక రకాలుగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. గతంలో వృద్ధులకు రూ.200లు ఉన్న పెన్షన్ ను రూ.2016 వరకు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. 

రాజగోపాల్ పై తలసాని ఫైర్ 

మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే వచ్చిందని మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుని పార్టీ మార్చి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారంటూ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుండి ఇప్పుడు తాము రూ.3000 వేల పెన్షన్ ఇస్తామని బీజేపీ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ది జరుగుతుందని ఆయన అన్నారు. మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను మంత్రి తలసాని అభ్యర్థించారు.