- ఉత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష
సికింద్రాబాద్, వెలుగు: లష్కర్బోనాలను ధూంధాంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సికింద్రాబాద్ లోని శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 9న లష్కర్బోనాలు, 10న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటాయని చెప్పారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిటీలో బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు రిలీజ్చేసిందని, ఆలయ కమిటీలు దరఖాస్తు చేసుకుంటే దేవాదాయ శాఖ అధికారులు నిధులు అందజేస్తారని చెప్పారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో స్ట్రీట్‌లైట్లు వెలిగేలా చూడాలని, భక్తుల తోపులాట లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, బోనాలతో వచ్చేవారికి ప్రత్యేక క్యూలైన్లు పెట్టాలని అధికారులకు సూచించారు.
శివసత్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు 9న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అవసరమైన చోట తాత్కాలిక సీసీ కెమెరాలు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వలంటీర్లుగా సేవ చేసేందుకు ముందుకొస్తే ఫొటోలతో కూడిన ఐడీ కార్డు ఇస్తామని తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, వాటర్ వర్క్స్ ఎండీ దానకిశోర్, కార్పొరేటర్లు చీరా సుచిత్ర, మహేశ్వరి, ఆలయ ట్రస్టీ కృష్ణ, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, మహంకాళి ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రంగారావు, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వసంత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
