అసెంబ్లీలో మంత్రి తలసాని vs ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

అసెంబ్లీలో మంత్రి తలసాని vs ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంట్రాక్టర్ అనడంపై దుమారం రేగింది. ఆ వెంటనే.. పేకాట ఆడేవాళ్లు మంత్రులు కాగా లేనిది.. కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అయితే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామన్నారు స్పీకర్ పోచారం. తలసాని, రాజగోపాల్ ఇద్దరిదీ తప్పేనని.. వారిద్దరి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు సీఎల్పీ నేత భట్టి. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ కలుగజేసుకున్నారు. మంత్రిపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారి చెప్పకుంటే.. చర్యలు తీసుకుంటామనడంతో.. చివరకు రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ప్రాజెక్టులు, అవినీతిపై సభలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు తాము కట్టినవేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్రెడ్డి అన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పేర్లు మార్చారంటూ విమర్శలు చేశారు. దీనికి మంత్రి పువ్వాడ కౌంటర్ ఇచ్చారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పోలవరంలో మునిగిపోతున్నాయన్నారు. తర్వాత పువ్వాడ వ్యాఖ్యలను తప్పుబట్టారు భట్టి. దీంతో అధికార, విపక్షాల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది.