ట్యాంక్ బండ్‌‌పై రూ.20 కోట్లతో ‘నీరా’ కేఫ్

V6 Velugu Posted on Jul 08, 2021

హైదరాబాద్: ప్రమాదవశాత్తు మరణించిన కల్లు గీత కార్మికులకు ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది. శాశ్వత అంగవైకల్యానికి గురైన వారితోపాటు తీవ్రంగా గాయపడిన గీత కార్మికులకు ఈ కార్యక్రమంలో ఎక్స్‌గ్రేషియాను అందించారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌‌తోపాటు శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులతోపాటు పెద్ద ఎత్తున గీత కార్మికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను కోల్పోయిన గీత కార్మికుల పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిస్తామన్నారు. లక్షలు సంపాదించకున్నా ఆత్మ గౌరవంతో బతికే వారు కల్లు గీత వృత్తిదారులని మెచ్చుకున్నారు. కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

గౌడన్నలకు స్పెషల్ లూనాలు
‘హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌‌ మీద రూ.20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్‌‌లు తెరుస్తాం. నల్గగొండలో రూ.8 కోట్లతో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఇతర కులస్తులు కల్లు గీయకుండా.. కేవలం గౌడలే చేసుకునేలా ప్రత్యేక జీవో తెచ్చాం. త్వరలో గౌడలకు మంచి డిజైన్‌‌తో కూడిన లూనాలు అందిస్తాం. హైదరాబాద్‌‌లోని కోకాపేటలో గౌడ కులస్థుల కోసం రూ.5 కోట్ల నిధులతో గౌడ భవన్ నిర్మిస్తాం. గౌడలు గౌరవప్రదంగా బతికేలా చేయడమే మా లక్ష్యం’ అని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 

కుల వృత్తిదారులు గౌరవంతో బతికేలా చేస్తున్నం
‘కుల వృత్తుల వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కుల వృత్తులదారులు ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తోన్న ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి, ఈత చెట్లు నాటడం జరుగుతోంది. గీత కార్మికులకు మోపెడ్ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్, ఇంటింటికీ నీళ్లు.. ఇవన్నీ కూడా కేసీఆర్ పాలనలోనే సాధ్యమైంది’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 

Tagged CM KCR, ex gratia, talasani srinivas yadav, Minister Srinivas Reddy, Masonry workers, BC Welfare Ministry, ‘Neera’ cafe

Latest Videos

Subscribe Now

More News