ఫ్రీగా చేప పిల్లలు, గొర్రెలు ఇవ్వడమంటే..  ఉద్యోగం ఇచ్చినట్టే

ఫ్రీగా చేప పిల్లలు, గొర్రెలు ఇవ్వడమంటే..  ఉద్యోగం ఇచ్చినట్టే

హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: మత్య్సకారులకు ఫ్రీగా చేప పిల్లలు ఇవ్వడమంటే, వాళ్లకు ఉద్యోగం కల్పించడమేనని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేపలు పట్టడం, గొర్రెలు కాయడం కూడా ఉపాధేనని.. అది కొంతమంది మూర్ఖులకు తెలియడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆయన హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు గొల్లకుర్మలు, మత్స్యకారుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి పాల్గొన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగాల భర్తీ పై లిమిటేషన్ ఉంటుంది. రాష్ట్రంలో నిరుద్యోగం ఉంది. కానీ ప్రభుత్వంలో ఉద్యోగాల సంఖ్య ఎంత ఉండాలో అంతే ఉంటుంది” అని తలసాని చెప్పారు. త్వరలో 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. కొందరు దుర్మార్గులు ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే దళిత బంధు ఆగిపోయిందని ఫైర్ అయ్యారు. 
హుజూరాబాద్ ను ఈటల అభివృద్ధి చేసిండు... 
‘‘హుజూరాబాద్ అభివృద్ధి తన వల్లే జరిగిందని ఈటల చెప్పుకుంటుండు. ఆయన వల్ల అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే. టీఆర్ఎస్ లో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండే అభివృద్ధి చేసిండు. ఇప్పుడు చేయగలడా?” అని తలసాని ప్రశ్నించారు. ‘‘ఆ రోజే రాత్రే సీఎం దగ్గరికి పోయి ‘అన్న నాది తప్పులేదు.. నువ్వు ఎంక్వయిరీ చేయి’ అంటే అయిపోతుండే. ఇప్పుడు అధికారం పోతే ఎట్లుంటదో ఈటలకు తెలుస్తది” అని అన్నారు.