బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

మెహిదీపట్నం, వెలుగు:  తెలంగాణ సంస్కృతి చాటిచెప్పే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసబ్ ట్యాంక్ లోని ఆయన ఆఫీసు నుంచి లష్కర్, ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ యేడు కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని సుమారు 3,500కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సాయం చెక్కులను అందిస్తున్నట్లు వివరించారు. 17న లష్కర్ బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు 2రోజుల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఆలయ నిర్వాహకులతో ప్రోగ్రాం ఏర్పాటు చేసి చెక్కులు అందజేస్తామన్నారు.

24వ తేదీన బోనాలు నిర్వహించే హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18న చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాతబస్తీలోని 25 ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్ అండ్ బీ  శాఖ ఆధ్వర్యంలో వేదికలను సిద్ధం చేస్తున్నామన్నారు. వానలు పడుతుండటంతో అధికారులు, లీడర్లు అలర్ట్​గా ఉండాలని సూచించారు. అత్యవసర సేవల కోసం జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ట్రోల్​ఫ్రీ నెంబర్​ 21111111ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్​, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్​, ముఠా గోపాల్, సుభాష్ రెడ్డి, అరికేపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మైనంపల్లి హన్మంతరావు, కలెక్టర్ లు అమయ్ కుమార్, హరీశ్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ 
తదితరులు పాల్గొన్నారు.