కేంద్రానికి ముందస్తుకు వెళ్లే దమ్ముందా?

కేంద్రానికి ముందస్తుకు వెళ్లే దమ్ముందా?
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ 

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే తాము కూడా సిద్ధమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ అన్నారు. శనివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌‌పోర్టులో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర మోడల్‌‌ను తెలంగాణలో అమలు చేస్తామంటే కుదరదన్నారు. కేంద్రం సై అంటే తాము అలాగే జవాబు చెప్తామన్నారు. మర్యాద ఇచ్చిపుచ్చుకుంటామే తప్ప ఎవ్వరికీ భయపడబోమన్నారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రే స్వాగతం పలకాలని ఎక్కడా లేదని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగానే తాను వచ్చానని చెప్పారు. టీఆర్‌‌ఎస్‌‌ ప్లీనరీ అప్పుడు టీఆర్‌‌ఎస్‌‌ ఫ్లెక్సీలకు కూడా పెనాల్టీ వేశారని, మంత్రులు కూడా జరిమానా చెల్లించారని తెలిపారు. బీజేపీ ఆఫీస్‌‌లో కేసీఆర్‌‌పై డిజిటల్‌‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తేనే తాము బైబై మోడీ అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో హైదరాబాద్‌‌కు వస్తున్న టూరిస్టులు ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్లాలన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌‌ సిన్హా రాక సందర్భంగా టీఆర్‌‌‌‌ఎస్‌‌ నిర్వహించిన ర్యాలీ శాంపిల్‌‌ మాత్రమేనన్నారు.