
- పనుల్లో ఆలస్యంపై ఆగ్రహం
- నేటి ఉదయంలోగా పనులు కంప్లీట్ చేయాలని ఆదేశం
కూసుమంచి, వెలుగు : సాగర్ ఎడమ కాల్వ రిపేర్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. కూసుమంచి మండలం మల్లాయిగూడెం వద్ద జరుగుతున్న సాగర్ కాల్వ రిపేర్లను సోమవారం పరిశీలించి మాట్లాడారు. కాల్వ రిపేర్లు ఆలస్యం కావడం, ఆఫీసర్ల మధ్య సమన్వయం లేకపోవడంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేర్లు నత్తనడకన సాగుతున్న విషయంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో మాట్లాడారు. ఆఫీసర్లు కోఆర్డినేషన్‌తో పనిచేసి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
డ్యూటీలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైరా, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి ప్రాంతాల్లో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు సాగునీటి ఇబ్బంది రాకుండా రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. మంగళవారం ఉదయం లోగా పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.