కాళేశ్వరం కమిషన్కు మంత్రి తుమ్మల లేఖ !

కాళేశ్వరం కమిషన్కు మంత్రి తుమ్మల లేఖ !
  • విచారణలో తన పేరును ఈటల ప్రస్తావించడంపై అభ్యంతరం
  • కేబినెట్ సబ్ కమిటీ అన్ని ప్రాజెక్టుల రీఇంజనీరింగ్​కు సంబంధించిందని వివరణ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్​కు మంత్రి తుమ్మల లేఖ రాసినట్లు సమాచారం. కమిషన్ ఎదుట తన పేరును ఎంపీ ఈటల రాజేందర్ ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ నెల 6న కమిషన్ విచారణకు ఈటల హాజరయ్యారు. ఎంక్వైరీలో భాగంగా హరీశ్ రావు నేతృత్వంలో ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని ఈటల పేర్కొన్నారు. ఆ సబ్ కమిటీలో హరీశ్ రావుతో పాటు తాను, తుమ్మల నాగేశ్వర రావు ఉన్నారని తెలిపారు. అయితే, దీనిపై మంత్రి తుమ్మల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

కేబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరంపై వేయలేదని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించి రీ ఇంజనీరింగ్​ కోసం వేశారని కమిషన్​కు వివరించినట్టు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన జీవోను కూడా లేఖకు అటాచ్ చేసినట్టు తెలిసింది. అయితే, సబ్ కమిటీ జీవో రావడానికి ముందే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి కన్సల్టెన్సీ నియామకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవో గురించి కూడా మంత్రి ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.