ములకలపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు నీటిని మూకమామిడి ప్రాజెక్టుకు మళ్లించే చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో నిర్వహించిన రైతు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ములకలపల్లిలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలంటే 20 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవసరమని, ప్రస్తుతం 8 వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా మరో 12 వేల ఎకరాలకు విస్తరించాలని రైతులకు సూచించారు.
భూగర్భ జలాల పెంపు కోసం ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలని, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా యాతాలకుంట, జూలూరుపాడు టన్నెల్‌లను పూర్తి చేసి సత్తుపల్లి, పాలేరు ప్రాంతాలకు గోదావరి జలాలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఆదివాసీ రైతుల ఆదాయం పెంచేందుకు ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం రైతులకు అపరాల విత్తనాల సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, స్థానిక సర్పంచ్ కొరస చంద్ర కళ, ఆయిల్ ఫామ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
