ఆగ్రోస్‌‌‌‌ పునరుద్ధరణకు ప్రణాళిక..ఆర్థిక స్థితిపై నివేదిక ఇవ్వండి: తుమ్మల

ఆగ్రోస్‌‌‌‌ పునరుద్ధరణకు ప్రణాళిక..ఆర్థిక స్థితిపై నివేదిక ఇవ్వండి: తుమ్మల

హైదరాబాద్‌‌, వెలుగు: వ్యవసాయశాఖ పరిధిలోని ప్రతి కార్పొరేషన్‌‌ సమర్థవంతంగా పని చేసేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు. నిరర్ధకంగా మారిన ఆగ్రోస్‌‌ కార్పొరేషన్‌‌ను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శనివారం మంత్రి తుమ్మల ఆగ్రోస్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటించని సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 శిథిలావస్థకు చేరిన ఎంఐటీ భవనాలు, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సెక్రటేరియట్​లో వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్ల పనితీరు, ఆర్థిక పరిస్థితులపై ఆయిల్‌‌ఫెడ్‌‌, మార్కెటింగ్‌‌, ఆగ్రోస్‌‌ తదితర సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, అన్ని కార్పొరేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా ప్రభుత్వం కార్యచరణతో ఉందన్నారు. 

ఎన్నో ఏండ్లు రైతులకు సేవలు అందించిన ఆగ్రోస్​ను పునరుద్ధరించే కార్యాచరణ కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించినట్లు తెలిపారు. కార్పొరేషన్ల ప్రస్తుత ఆర్థిక స్థితి, రుణాలు, ఆస్తుల వివరాలను సమగ్ర నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే విధంగా అన్ని అనుబంధ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అగ్రికల్చర్​ డైరెక్టర్‌‌ గోపి, ఆయిల్‌‌ఫెడ్‌‌ ఎండీ యాస్మిన్‌‌ బాషా, మార్కెటింగ్‌‌ డైరెక్టర్‌‌ లక్ష్మీబాయి, అగ్రోస్‌‌ ఎండీ రాములు తదితర అధికారులు పాల్గొన్నారు.