ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా చూశాం : మంత్రి తుమ్మల

ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా చూశాం : మంత్రి తుమ్మల
  •     మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌‌లో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. గత యాసంగి సీజన్‌‌లో 10.24 లక్షల టన్నుల యూరియాను రైతులు వినియోగించగా, ఈ యాసంగిలో మార్చి 18 నాటికి 10.73 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 

గతేడాదితో పోలిస్తే ఇప్పటికే 30 వేల టన్నులు అధికంగా వినియోగం నమోదైందన్నారు. రైతులు క్యూలైన్లలో నిలబడే పరిస్థితి లేకుండా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌‌ను ప్రవేశపెట్టామని, ఈ యాప్ ద్వారా రైతులు ముందుగానే యూరియాను బుక్ చేసుకునే సదుపాయం కల్పించామని, దీంతో ఇప్పటివరకు 20.74 లక్షల మంది ద్వారా 88.35 లక్షల యూరియా సంచులను కొనుగోలు చేసినట్లు మంత్రి చెప్పారు. 

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో రామగుండం ఫర్టిలైజర్స్ కర్మాగారాల్లో ఉత్పత్తి అంతరాయం, నాగార్జున ఫర్టిలైజర్స్ కర్మాగారం షడ్​డౌన్​కారణంగా అంతరాయం కలిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి అవసరమైన ఎరువులను సమకూర్చినట్లు తెలిపారు. గత వానాకాలంతో పోలిస్తే 15 వేల టన్నులు అధికంగా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.