మంత్రి తుమ్మల ఎమోషనల్.. నీళ్లు చల్లుకోవడమూ తప్పేనా?

మంత్రి తుమ్మల ఎమోషనల్.. నీళ్లు చల్లుకోవడమూ తప్పేనా?
  • నేను అభిమానించే వ్యక్తులు మాట్లాడిన తీరుతో బాధపడ్డాను: తుమ్మల
  • చేసిన మంచి పనుల్లో కనిపించాలి.. ఫ్లెక్సీల్లో కాదు
  • ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు 
  • ఖమ్మం జిల్లాకు నీళ్లు రావాలన్నదే నా కోరిక 
  • హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి ఎమోషనల్

ఖమ్మం, వెలుగు: నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడూ చేసే పనిలో క్రెడిట్ కోసం ఆరాటపడలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘‘చేసిన పనుల్లో మంచి కనిపించాలి.. కానీ ఫ్లెక్సీల్లో కాదు. కీర్తి, ప్రతిష్ట, ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు. నేను చేసిన పనే నాకు ఫ్లెక్సీ లాంటిది” అని చెప్పారు. మంగళవారం ఖమ్మం క్యాంప్ ఆఫీస్​లో మీడియాతో తుమ్మల మాట్లాడారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన కామెంట్లకు తుమ్మల కౌంటర్ ఇచ్చారు. ఆ టైమ్​లో తుమ్మల ఎమోషనల్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గోదావరి నీళ్లు అందించాలన్నదే తన కోరిక అని, అంతే తప్ప తనకు ఎలాంటి స్వార్థం లేదన్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేసి రాజ కీయ లబ్ధిపొందాలని బీఆర్ఎస్ ​ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. 

తాను అభిమానించే వ్యక్తులు మాట్లాడుతున్న తీరు తనను బాధ పెట్టిందని ఆవేదన చెందారు. ‘‘గోదావరి నీళ్లు నెత్తిపై చల్లుకుంటే తప్పేంటి? బిజీ కొత్తూరు పంప్ హౌస్ ను నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి ప్రారంభిస్తే, నేను సంతోషంతో నీళ్లు నెత్తిన చల్లుకున్నా. మీకు చల్లుకోవాలని ఉంటే.. ఈ నెల 15న రండి. గోదావరి జలాలు మీకు కూడా చల్లుతాను. వైరా బహిరంగ సభకు అటెండ్ అయితే, సభా వేదికపైనే బీఆర్ఎస్ ఏం చేసిందో అందరికీ చెబుతాను” అని హరీశ్​ రావుకు తుమ్మల కౌంటర్ ఇచ్చారు. 

ఎన్నో ప్రాజెక్టుల్లో నా భాగస్వామ్యం ఉంది.. 

సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్​హౌస్​లు మాత్రమే పూర్తయ్యాయని తుమ్మల చెప్పారు. ‘‘టన్నెల్స్, 155 స్ట్రక్చర్స్ పూర్తి కాకుండా, ఫీల్డ్ చానల్స్, డిస్ట్రిబ్యూటరీలు లేకుండా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రావు. ఇవన్నీ కావాలంటే ఇంకో ఐదేండ్ల సమయం, రూ.10 వేల కోట్ల నిధులు కావాలి. అప్పటిదాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతోనే సీఎం, ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి వైరా లింక్ ​కెనాల్​ను చేపట్టాం” అని తెలిపారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు గంగతో పాటు అనేక చరిత్రాత్మక ప్రాజెక్టుల్లో నా భాగస్వామ్యం ఉంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్​ కెనాల్, రైట్ బ్యాంక్ కెనాల్ పనులు నా చేతుల మీదుగా జరిగాయి. 

సాగర్​మీద నిర్మించిన ప్రతి లిఫ్ట్ మీద నా పేరు ఉంది. రైతుల ఆనందమే నా ఆనందం. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు తీసుకురావాలనేదే నా చిరకాల కోరిక. దాని కోసమే పార్టీలు మారాను. ఆనాడు కేసీఆర్​ఆహ్వానం మేరకే బీఆర్ఎస్​లో చేరాను. ఆయనతోనే సీతారామకు శంకుస్థాపన చేయించాను. కానీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. అందుకే రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్​లో చేరాను. సీతారామకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం లేకపోవడంతో.. భద్రాచలంకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో వైరా లింక్​ కెనాల్ గురించి చెప్పి ఒప్పించాను” అని చెప్పారు.  

కుహనా విమర్శలకు సమాధానం ఇవ్వను.. 

ఏ ప్రాజెక్టు కట్టినా, ఎంత అభివృద్ధి చేసినా.. అదంతా ప్రజల డబ్బేనని తుమ్మల అన్నారు. ‘‘నా గురించి తెలిసి న వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇకపై అలాంటి కుహనా విమర్శలకు సమాధానం ఇవ్వను. అధికారం కోల్పోయాక కొందరు హాస్టళ్లు, సోషల్ వెల్ఫేర్ అంటూ పరామర్శలు చేస్తున్నారు. పదేండ్లలో అవన్నీ గుర్తుకురాలేదా? కండ్లకు కనబడలేదా?” అని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్​అవినీతి, నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ‘‘రుణమాఫీ విషయంలో వాట్సాప్​లో సమాచారం ఇవ్వాలని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. మరి బీఆర్ఎస్ హయాంలో రెండోసారి చేసిన రుణమాఫీ గురించి ముందుగా సోషల్ మీడియాలో వివరాలు తీసుకోవాలి. అప్పటి బకాయిలను ముందుగా రైతులకు చెల్లించాలి. రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు?” అని అన్నారు. ‘‘బీఆర్ఎస్​ను అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. మా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలే శిక్షిస్తారు. బీఆర్ఎస్​తప్పులను మాపై రుద్దాలని చూస్తే, అవి మాకు అంటవు” అని అన్నారు.