హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో రైతులకు యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి కనీసం 3.50 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచాలన్నారు. సోమవారం సెక్రటేరియట్‌లో ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానాకాలం–2026 సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 11.50 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరగా.. 10 లక్షల టన్నులే కేటాయించిందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ తోపాటు దాదాపు 10 వేల టన్నుల డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్రం కేటాయింపుల ప్రకారం.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకు 2 లక్షల టన్నులు, జూలై, ఆగస్టులో నెలకు 1.5 లక్షల టన్నులు, సెప్టెంబర్‌లో 1 లక్ష టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
అయితే ఏప్రిల్‌లో కేటాయించిన 2 లక్షల టన్నులకు 1.53 లక్షల టన్నులే రాష్ట్రానికి చేరిందని, మే నెలలో ఇప్పటివరకు 48,985 టన్నులే వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాల చొప్పున ఫెర్టిలైజర్ యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారని తెలిపారు.
