
- కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు తుమ్మల లేఖ
- జులై కోటా 1.60 లక్షల టన్నులు.. గత 3 నెలల బ్యాలెన్స్ 1.94 లక్షల టన్నులు ఇవ్వండి
- రామగుండంలోని ఆర్ఎఫ్‌సీఎల్ నుంచి రాష్ట్రానికి కోటా పెంచాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవసరాల కోసం వెంటనే 3.5 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రస్తుత జులై కోటా 1.60 లక్షల టన్నులు కాగా, గత మూడు నెలల కోటాలో కోత పెట్టిన 1.94 లక్షల టన్నులు ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి బుధవారం లేఖ రాశారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంటల సాగు ప్రారంభించారు. స్టాక్తక్కువగా ఉండడంతో పలుచోట్ల కొరత ఏర్పడింది. జులై కోటా యూరియాతో పాటు గత మూడు నెలల్లో కోత పెట్టిన యూరియాను సైతం పంపిస్తే రైతులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తాం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో చొరవ చూపాలి” అని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
రామగుండం నుంచి సప్లై పెంచండి..
ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను కేంద్రం రాష్ట్రానికి 5 లక్షల టన్నుల యూరియా కేటాయించిందని.. కానీ ఇందులో కేవలం 3.06 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసి, 1.94 లక్షల టన్నులను ఇంకా సరఫరా చేయలేదని మంత్రి తుమ్మల గుర్తుచేశారు. ఏప్రిల్, మే, --జూన్‌లో ఏర్పడిన కొరతను భర్తీ చేయడానికి అదనపు సరఫరా ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఈ వానకాలం సీజన్‌లో జులై, ఆగస్టు, సెప్టెంబర్‌లో యూరియా వినియోగం అధికంగా ఉంటుందని.. కొరత ఇలాగే కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. జులై కోటా కింద రాష్ట్రానికి1.60 లక్షల యూరియా కేటాయించారని, ఇందులో 0.97 లక్షల టన్నుల దిగుమతి యూరియాను కేటాయించడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నౌకాశ్రయాల ద్వారా సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) నుంచి రాష్ట్రానికి కేటాయింపులను 30,800 టన్నుల నుంచి 60వేల టన్నులకు పెంచాలని కోరారు.