యువత స్కిల్స్ పెంచేలా ఏటీసీలను ఏర్పాటు చేశాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యువత స్కిల్స్ పెంచేలా ఏటీసీలను ఏర్పాటు చేశాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు చర్యలు  
  •     ఏటీసీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఖమ్మం టౌన్, వెలుగు :  రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా ఏటీసీని ఏర్పాటు చేశామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాబోయే 5 నుంచి 10 ఏండ్ల వరకు ప్రపంచీకరణలో జరిగే మార్పులకు అనుగుణంగా ఏటీసీ కోర్సులు డిజైన్ చేశామన్నారు. 

ప్రపంచంలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆధునిక సాంకేతిక కేంద్రంలో అందించే కోర్సులను పూర్తి చేసే ముందే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా టాటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. యువతకు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికే శక్తి సామర్థ్యాలు అందించాలనే లక్ష్యంతో స్కిల్ డెవలప్​మెంట్ కు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం ఏసీలకు మార్కెట్​లో డిమాండ్ ఉందని చెప్పారు. 

ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం చూస్తుందని, దానికి సంబంధించిన మెకానిక్స్ లో మనం నిష్ణాతులం కావాలని సూచించారు. యువత నైపుణ్యం సంపాదిస్తే పరిశ్రమలు మన వెంట వస్తాయని వివరించారు. ప్రస్తుత ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డిమాండ్ తగ్గిపోయిందని, అక్కడ ప్రాక్టికల్స్ పరిజ్ఞానం తక్కువగా ఉండడం, కోర్సులు అప్ డేట్ కాకపోవడం వల్ల బీటెక్ చదివినా ఉద్యోగాలు రావడం లేదని చెప్పారు. 

నిరుద్యోగ యువతకు మంచి నైపుణ్యాలు అందించాలని ఉద్దేశంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లో నాలుగు ఏటీసీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అవసరమైన ఉపాధి ట్రైనింగ్ శిక్షణ విద్యార్థులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏటీసీ కేంద్రంలో ఉన్న కోర్సుల ద్వారా ప్రపంచంలో ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉంటాయో విద్యార్థులకు వివరించేలా డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 

ఇంజినీరింగ్ కోర్సుల కన్నా మెరుగైన నైపుణ్య కోర్సులు ఏటీసీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఏటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబ్​, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్మికశాఖ సహాయ కమిషనర్ కృష్ణవేణి, కార్పొరేటర్ సత్యనారాయణ, తహసీల్దార్ సైదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

ఓట్ చోరీ.. గద్దీ చోడ్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి..

ఖమ్మం సిటీలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఓట్ చోరీ.. గద్దీ చోడ్ ర్యాలీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిలుపుతో ఓటు చోరీని నిరసిస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోందని తెలిపారు. మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.