ఎరువుల కొరత రాకుండా చూస్తున్నం..కేంద్రం టైంకు యూరియా సరఫరా చేయలేదు: మంత్రి తుమ్మల

ఎరువుల కొరత రాకుండా చూస్తున్నం..కేంద్రం టైంకు యూరియా సరఫరా చేయలేదు: మంత్రి తుమ్మల
  •     యాసంగి సీజన్‌‌‌‌ ఎరువుల సరఫరాపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సెక్రటేరియెట్​లో యాసంగి సీజన్‌‌‌‌ ఎరువుల సరఫరా ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత సీజన్‌‌‌‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులను సమయానికి సరఫరా చేయలేదన్నారు.

 ఈసారైనా కేంద్రం కేటాయించిన ఎరువుల్లో కనీసం 60 నుంచి70 శాతం ఎరువులను నవంబర్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌ నెలల్లో సరఫరా చేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పంపిణీ చేయవచ్చన్నారు. ‘‘అక్టోబరులో రాష్ట్రానికి కేటాయించిన యూరియా 2 లక్షల టన్నుల్లో 1.88 లక్షల టన్నులు అందాయి.  మిగతా 37 వేల టన్నులు రాష్ట్రానికి చేరే దశలో ఉన్నాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 లక్షల టన్నుల యూరియా, 58 వేల టన్నుల డీఏపీ, 2.09 లక్షల టన్నుల కాంప్లెక్స్‌‌‌‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇవి రాబోయే రోజుల్లో మరింత పెరగనున్నాయి. డిసెంబరు మూడో వారం నుంచి యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో యూరియా త్వరగా రవాణా చేయాలని కేంద్రాన్ని కోరాం’’ అని మంత్రి తెలిపారు. 

ఇక రైల్వే శాఖ వరంగల్‌‌‌‌  రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను మూసివేసి చింతలపల్లి పాయింట్‌‌‌‌కు గూడ్స్‌‌‌‌  హ్యాండ్లింగ్‌‌‌‌ మార్చడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఈ మార్పుతో  ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలో ఎరువుల సరఫరాకు అంతరాయం కలగవచ్చన్నారు. చింతలపల్లి పాయింట్‌‌‌‌ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే వరకు కనీసం 4, 5 నెలల పాటు వరంగల్‌‌‌‌  రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను కొనసాగించాలని రైల్వే మంత్రికి లేఖ రాశామని వెల్లడించారు.