రైతు భరోసాపై మీరు మాట్లాడడం విడ్డూరం: తుమ్మల

రైతు భరోసాపై మీరు మాట్లాడడం విడ్డూరం: తుమ్మల
  •     మీ టైమ్​లో ఎప్పుడు ఇచ్చారో రైతులకు తెలుసు
  •     బీఆర్ఎస్​ నేతలపై మంత్రి తుమ్మల ఫైర్
  •     విమర్శలు మాని సూచనలు చేయాలని హితవు

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసాపై బీఆర్ఎస్​ మాజీ మంత్రులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘‘రైతు భరోసా ఎప్పుడిస్తారు, పంటవేసే ముందు ఇస్తారా? పంట వేశాక ఇస్తారా?” అని మాట్లాడటం చూస్తుంటే వారికి మతిమరుపు ఉందని అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు  రైతుబంధు ఇచ్చారో, ఎన్ని రోజుల పాటు ఇచ్చారో, ఎన్నిసార్లు పూర్తిగా ఇవ్వకుండా ఆపేశారో రైతులకు తెలుసన్నారు. 2018 లో వానాకాలంలో 128 రోజులు, యాసంగిలో 161 రోజుల పాటు రైతుబంధు ఇచ్చారని తెలిపారు.

అదే 2019 వానాకాలంలో 138 రోజులు, 2020 వానాకాలంలో 169 రోజులు, 2021–-22 యాసంగిలో 84 రోజులు, 2022–-23 యాసంగిలో 148 రోజులు, 2023 వానాకాలంలో 108 రోజుల పాటు రైతుబంధు నిధులు విడుదల చేశారని మంత్రి  గుర్తుచేశారు.  గుట్టలు, రాళ్లురప్పలు, పుట్టలు, రియల్  ఎస్టేట్  వెంచర్లు, నేషనల్​ హైవేలు, బంజరు భూములకు రైతుబంధు ఇచ్చి రూ.26,500 కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేశారని విమర్శించారు. రైతు భరోసాని ఒక ఆదర్శవంతమైన పథకంగా తీసుకొచ్చే తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. రైతు భరోసా అమలుకు రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని, రాష్ట్ర కేబినెట్  నియమించిన సబ్ కమిటీలో విధివిధానాలు రూపొందించి త్వరలోనే ఆ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడం మాని, సలహాలు, సూచనలు ఇస్తే  స్వీకరిస్తుందని బీఆర్ఎస్  నేతలకు మంత్రి హితవు పలికారు.